జాతీయ రహదారుల నిధుల మంజూరుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కృషి చేయలేదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలోనూ ఆయన శ్రద్ధ చూపలేదన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు.
జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారికి నిధులు మంజూరు చేయడంలో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేసిన కృషి ఏంటని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశ్నించారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఆయన నిధుల మంజూరులో విఫలమయ్యారన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో రాష్ట్రానికి రూ. 216 కోట్ల 44 లక్షల నిధులు జాతీయ రహదారుల అభివృద్ధికి మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్రం తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించి కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. కానీ ఏనాడూ ఆయన స్పందించలేదన్నారు. నిజాలు తెలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని రవిశంకర్ కోరారు.
ఇదీ చదవండి: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు: ఎమ్మెల్యే రవిశంకర్