దమ్మక్కపేటకు చెందిన శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లి వారితో మంత్రి గంగుల కాసేపు మాట్లాడారు. దళిత బంధు పథకంపై వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు.
దళిత బంధు పథకంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దళితబంధు ద్వారా ప్రయోజనం ఉంటుందా? లేదా ? అని అడిగారు. దళితబంధు లబ్ధిదారులంతా ఒకే వ్యాపారంపై దృష్టి పెట్టొద్దని సూచించారు. అధికారుల సూచనలతో వివిధ రంగాలపై దృష్టిసారించాలని చెప్పారు. దళితులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అని మంత్రి పలువురిని ప్రశ్నించారు. దళిత బంధు పథకంలో ఇచ్చిన పది లక్షలను ఏడాదిలోగా 20 లక్షలు చేసి చూపించాలని సూచించారు. దమ్మక్కపేటలోని దళిత కాలనీలో కాలినడకన తిరుగుతూ అభిప్రాయాలను సేకరించిన మంత్రి... అర్హులందరికీ దళిత బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.