హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad by elections 2021) ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార తెరాస పార్టీ... తమ మంత్రులను రంగంలోకి దింపింది. హుజూరాబాద్‌లో బీసీ మంత్రులు ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రధాన లక్ష్యంగా మంత్రులు విరుచుకుపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయని ఈటల … ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్(srinivas goud about etela rajender) విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఈటలపైనే ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు భాజపా నాయకులు రెచ్చగొట్టే మాటలను ప్రజలు నమ్మొద్దని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. కేంద్రం... ధరలను పెంచుకుంటూ పోతే.. తమ ప్రభుత్వం మాత్రం సంక్షేమానికే పెద్దపీట వేసిందని గుర్తుచేశారు.
మంత్రిగా ఉన్నప్పుడే ఈటల ఏమీ చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారు?. ఈటలను తెలంగాణకు పరిచయం చేసింది కేసీఆరే. అవినీతి ఆరోపణలు ఈటలపైనే ఎందుకొచ్చాయి?. ఈటలది బయట బీసీ కార్డు... లోపల ఓసీ కార్డు.
-శ్రీనివాస్‌గౌడ్, మంత్రి
మంత్రిగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపాలో చేరడంతో హుజూరాబాద్ ఎన్నికలు (huzurabad by election ) ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉపఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్(తెరాస), ఈటల రాజేందర్(భాజపా), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల తరఫున మూడు పార్టీలు ప్రచారంలో నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడ్డాయి. ఓటర్ల మన్ననల్ని పొందేందుకు చెమటోడ్చాయి.
హోరాహోరీ ప్రచారం
మూడు ప్రధాన పార్టీల తరఫున ప్రచారం హోరాహోరీగా సాగింది. మాటల తూటాలు పేలాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. తెరాస తరఫున మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతను తన భుజాన మోశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ముమ్మరంగా ప్రచారం చేశారు. భాజపా తరఫున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నిత్యానందరాయ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: