Minister KTR Interesting Comments : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రామగుండంతో పాటు జగిత్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభం కాగా.. వర్చువల్ పద్దతిలో కరీంనగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరులో నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జూమ్ ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఆయన వీక్షించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను చదువులో అమ్మ కోరికను, నాన్న కోరికను తీర్చలేకపోయానని.. చివరికి రాజకీయ నాయకుడినయ్యానని మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR Old Memories Share with Students : ఈ సందర్భంగా తానూ బైపీసీ విద్యార్థినేనని మంత్రి గుర్తు చేసుకున్నారు. నాన్న తనను ఐఏఎస్ చేయాలని అనుకునే వారని చెప్పారు. అమ్మకు తనను డాక్టర్ చేయాలన్న కోరిక ఉండేదని చెప్పారు. ఎంసెట్‌లో 1600 ర్యాంక్(KTR Eamcet Rank) సాధించినా.. ఎంబీబీఎస్ సీటు సాధించలేకపోయానని వివరించారు. దీంతో అటు ఇటు కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకుడినయ్యానని చెప్పడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. ప్రతి జిల్లాకు మెడికల్ సీటు అందుబాటులోకి రావడంతో తెలంగాణలో ఏటా 10 వేల సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. తాను 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం గొడవ జరిగిందని గుర్తు చేసుకున్నారు. డిగ్రీ కాలేజీని సిరిసిల్ల, వేములవాడలో పెట్టాలని గొడవ జరిగి.. అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టారని పేర్కొన్నారు.
"నాకు ఆరోజు ఎంసెట్‌లో 1600 ర్యాంక్ వచ్చింది. అయినా ఎంబీబీఎస్ సీటు రాలేదు. మా నాన్న ఏమో ఐఏఎస్ కావాలని అన్నారు. మా అమ్మ ఏమో డాక్టర్ కావాలని చెప్పింది. నేను మధ్యలో రాజకీయ నాయకుడిని అయ్యాను. 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు సిరిసిల్లాలో ఓ డిగ్రీ కాలేజ్ గురించి గొడవ ఉండేది. ప్రస్తుతం అలా ఏం లేదు. అన్ని సౌకర్యాలు కల్పించాం."- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
KTR Speech about Doctor Profession : ఈ క్రమంలోనే గతంలో ఒక కాలేజ్ కోసం గొడవపడ్డ సిరిసిల్లలో.. ఇప్పుడు జేఎన్‌టీయూ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ త్వరలో ఆక్వా కళాశాల రాబోతుందన్నారు. అయితే వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని.. పేదలకు సేవ చేసేందుకు మంచి శిక్షణ పొందాలని సూచించారు. ఆపదలో వచ్చే వాళ్లు అటు దేవుడ్ని.. ఇటు వైద్యులైన డాక్టర్లనే వేడుకుంటారని తెలిపారు. అనంతరం వైద్య విద్యార్థులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో చదివి మంచి పేరు తీసుకురావాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలల్లో సమస్యలు ఉంటాయని.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.