మంత్రి కేటీఆర్ కరీంనగర్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి దిగువ మానేరు జలాశయం వద్ద మొక్కలు నాటి... శాతవాహన వర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రారంభించారు. నగర ప్రజలకు నిత్యం తాగునీరు అందించేందుకే దీనిని నిర్మించామని మంత్రి వెల్లడించారు.
''కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా... కరీంనగర్‌లో నాంది పలకడం సంప్రదాయంగా మారింది. ఇక్కడ నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుంది.
పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మాణం చేపట్టాం. 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో దీనిని నిర్మించాం. సీఎం నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టిపెట్టాం. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందరికీ 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. దేశానికి ధాన్యభాండాగారంగా రాష్ట్రం మారింది. తెలంగాణలో గ్రామీణ జీవితాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. తాగు, సాగునీరు, విద్యుత్ ఇబ్బందులను తక్కువ కాలంలో అధిగమించాం.''
-మంత్రి కేటీఆర్
త్వరలోనే తీగల వంతెనను పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరీంనగర్‌కు కొత్త శోభను తీసుకువచ్చేలా జంక్షన్ రూపొందిస్తామన్నారు. టీ హబ్ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్‌లో ఏర్పాటు కాబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఐసోలేషన్ కిట్.. అందరికీ దక్కదు.. అన్నీ ఉండవు..!