హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Bjp Candidate Etela Rajender) గోబెల్స్ ప్రచారం చేస్తూ లబ్ధిపొందే యత్నం చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao Comments) అన్నారు. భాజపా అనే బురదలో దిగి తనకు మాత్రం బురద అంటకుండా జాగ్రత్త పడుతున్నారని విమర్శించారు. భారత్ మాతాకీ జై అని జై శ్రీరాం అన్న నినాదాలు కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు. భాజపా అన్న బురదలో దిగిన తర్వాత బురద అంటొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. గత ఏడేళ్ల భాజపా పాలనను చూసి ఓటేయాలని అడగమని సలహా ఇచ్చారు.
తాము అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు (Harish Rao Comments) అడుగుతున్నామన్నారు. ఇప్పటి వరకు అయిదు అంశాలపై సవాల్ విసిరితే సమాధానం చెప్పకుండా రోజుకు ఒక కొత్త ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో మీరు చేసే అభివృద్ధి ఏమిటో చెప్పి ఓట్లు అడగాలే తప్ప అబద్ధాల పునాదులపై ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వడ్డీ లేని రుణాలకు చెల్లని చెక్కులు ఇచ్చారని, వంట గ్యాస్‌లో 291 రూపాయల పన్ను విధించారని, నేను మాట్లాడుతుంటే కరెంటు కట్ చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పది రోజల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా? డబల్ బెడ్రూం కట్టనందుకు వేయాలా? ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా అవలంభిస్తున్న విధానాల వల్ల ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. తెలంగాణాపై కొత్త కుట్ర మొదలయ్యిందన్నారు. వాస్తవానికి థర్మల్ కేంద్రాల్లో 22 రోజుల బొగ్గు నిల్వలు ఉండాలి కాని 15రోజుల నిల్వ ఉంటే చాలని సింగరేణి బొగ్గు ఇతర ప్రాంతాలకు తరలించాలని కొత్త కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మీ ప్రభుత్వ పాలన గురించి మీరు ఓటు అడిగితే.. కేసీఆర్ (Cm Kcr) పాలన గురించి తాము అడుగుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో తమ పార్టీ చేసిన పనులు చెప్పుకోవాలి. లేదా ఎదుటి పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపాలి. భాజపాను మీరు ఓన్ చేసుకోవడం లేదు. మిమ్నల్ని భాజపా ఓన్ చేసుకోవడం లేదు. ఎక్కడా జై భారత్ మాతా అనడం లేదు. జై శ్రీరాం అనడంలేదు. రాజేందర్ భాజపాకు దూరం ఉన్నరు. భాజపా ప్రభుత్వ నిర్ణయాలకు తాను దూరం అన్నట్లు.. తాను భాగం కాన్నట్లు మాట్లాడుతున్నడు. రాజేందర్ ప్రచార సరళి, తాను వేరు, భాజపా వేరు అన్నట్లు మాట్లాడుతున్నరు. నిజమైన భాజపా కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బాధపడుతున్నరు. రాజేందరన్న మీరు భాజపా అనే బురద గుంతలో దిగారు. బురద అంటకుండా ఉంటుందా? గ్యాస్ ధరలు భాజపా ప్రభుత్వ విధాన నిర్ణయమా కాదా? కేంద్రం గ్యాస్ ధరలు పెంచలేదా దీనికి సమాధానం చెప్పాలి.
-- హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
ఇదీ చూడండి: etela rajender: 'ఉపఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మరి మీరు?'