హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ఇరు పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్లే ఆడపడుచులు... ముందుగా వంటింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని పోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఛలోక్తి విసిరారు. గ్యాస్ ధర పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతున్నరని ఆరోపించారు. తన ప్రచార వాహనంపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు.
ఓట్ల కోసం వచ్చే ఈటల రాజేందర్ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని అన్నారు. బొట్టుబిళ్లలు,గడియారాలు ఇచ్చి ఈటల ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి చేయని ఈటలను గెలిపించాలా...ని రంతరం మీ సంక్షేమాన్ని ఆకాంక్షించే తెరాసను గెలిపించాలా ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. పేదింటి బిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
ఓటమి భయంతోనే ఎక్కువ నామినేషన్లు...
ఓటమి తప్పదని భావించిన ప్రతిపక్షాలు చాలామందితో నామినేషన్లు వేయించే పనిలో పడ్డాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని ప్రజలను తికమక పెట్టేందుకు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని అన్నారు. వృద్ధులు, మహిళలు, యువత బ్యాలెట్ పత్రంలో కారు గుర్తు దొరకబట్టి ఓటెయ్యాలని పేర్కొన్నారు. భాజపా నాయకులు తమకు తాముగా కట్లుకట్టుకొని తెరాస నాయకులు దాడి చేసినట్లుగా నమ్మించి ప్రచారం చేసేందుకు త్వరలో సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. భాజపా పేదల కడుపు కొట్టి ధనికులకు లాభం చేకూరుస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే గోరీ కడతా అని ఈటల అనడం శోచనీయమన్నారు. వానాకాలం పంటను మొత్తం కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సతీష్‌కుమార్, గువ్వల బాలరాజు, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Etela Nomination: ఈటల రాజేందర్‌పై 19 కేసులు