తెరాస మంత్రులు ఒకరి తర్వాత ఒకరు వార్తల్లో నిలుస్తున్నారు. మహిళా అధికారితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. నేడు ఓ సభలో మంత్రి గంగుల కమలాకర్ నోట చంద్రబాబు మాట రావటం చర్చనీయాంశంగా మారింది.
దీవించాలని జనాలను అడిగే క్రమంలో...
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్... తెదేపా అధినేత చంద్రబాబు పేరు వల్లె వేశారు. కరీంనగర్ గ్రామీణ మండలం ఇరుకుల్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... మొక్కలు నాటిన అనంతరం గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మొదట్లో రూ. 200 మాత్రమే ఉన్న ఆసరా పింఛన్... ఇప్పుడు రూ. 2000 వేలకు పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. అప్పటి అవసరాలు వేరు ఇప్పటి అవసరాలు వేరని పేర్కొన్న మంత్రి... మంచి చేసిన వారిని దీవించాలా వద్దా అని ప్రజలను అడిగారు.
నాలుక కరుచుకున్న గంగుల...
"కడుపు నిండా అన్నం పెట్టినవారిని, నీ కడుపు సల్లగుండా అని దీవిస్తాం... మరి.. గిన్ని మంచి పథకాలు ఇచ్చిన చంద్రబాబుకు కడుపునిండా దీవనార్తులు పెట్టాలా వద్దా...? చెప్పండవ్వా..." అనగానే సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు. వెంటనే మంత్రి తేరుకుని... "అదే.. ఇన్ని మంచి పథకాలిచ్చిన కేసీఆర్‌ను కడుపునిండా దీవించాలే... సరేనా..." అంటూ మాట దాటేసే ప్రయత్నం చేశారు.
నెటిజన్ల కామెంట్లు...
మంత్రి గంగుల కమలాకర్ నోట చంద్రబాబు పేరు రావడంతో... ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తెదేపా నుంచి బయటకు వచ్చి ఇన్నేళ్లైనా... చంద్రబాబును మరిచిపోలేక పోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలే... ఎప్పుడు దొరుకుతారా అని ప్రతిపక్షాలు కాచుకుని కూర్చుంటే... మంత్రులు ఇలా నోరు జారుతున్నారేంటని పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు గంగుల వ్యాఖ్యలతో... :తెరాసలో ఉన్నోళ్లంతా తెదేపా నాయకులే.." అని రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లకు బలం చేకూరుతున్నట్టవుతోందని సైలెంట్‌గా చెవులుకొరుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే... "ఇలాంటివి రాజకీయ నేతలకు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. వీటిని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఏదో ఓ సమయంలో అందరూ నోరు జారుతూనే ఉంటారు" అని కొందరు తమ నేతలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చూడండి: