ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 13 మందిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వైరస్ విస్తరణ నేపథ్యంలో కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు.
ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని... ప్రార్థనా మందిరాలకు వెళ్లొద్దని మంత్రి గంగుల సూచించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మంది కలెక్టరేట్ ప్రాంతాల్లో 48గంటల పాటు పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. కలెక్టరేట్ నుంచి 3కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటింటా పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య సిబ్బందితో 100 బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు.
ఇంటింటా పరీక్షలు నిర్వహించాలంటే అందరు ఇళ్లలోనే ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించారు. నగరం సురక్షితంగా ఉండాలంటే ప్రజలందరూ సహకరించాలన్నారు. నిత్యావసర వస్తువులు మినహా అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. కలెక్టరేట్ ప్రాంతంలోని అన్ని దుకాణాలను మూసివేయించి... అతనిని కలిసిన వ్యక్తుల సమాచారాన్ని అధికారులు సేకరించారు.
ఇవీ చూడండి: కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం