యాసంగి ధాన్యం కొనుగోళ్లు.. కేంద్రం చేతుల్లోనే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేంద్రం కొనుగోలు చేసేలా రైతులందరూ కలిసి.. ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ జిల్లా నగునూర్, కొత్తపల్లి, దుర్శేడ్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల ప్రారంభించారు.
మంత్రి అసహనం
అనంతరం రైతులతో కాసేపు మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పంటలను కొనుగోలు చేసినట్లుగానే తర్వాత యాసంగిలో పంటను కొనుగోలు చేస్తారా అని రైతులు పదేపదే అడగడంతో గంగుల అసహనం వ్యక్తం చేశారు.
యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రం చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేదేమీ లేదు. కేవలం పంట పండించేందుకు కావాల్సిన మౌలిక వసతులు, యంత్రాలను మాత్రమే రాష్ట్రం సమకూర్చగలదు. కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. రాష్ట్రంలోని భాజపా నాయకులు.. ధాన్యం కొనేలా కేంద్రాన్ని ప్రయత్నించాలి. బాయిల్డ్ రైస్‌తో సహా ప్రతి గింజా కేంద్రం కొనేలా... రైతులు తమతో కలిసి ఒత్తిడి తీసుకురావాలి. -గంగుల కమలాకర్, పౌర సరఫరాల శాఖ మంత్రి
మంత్రి గంగుల రైతులకు పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని.. ఆ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేసేలా రైతులందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం తనతో కలిసి రావాలని రైతులను కోరారు.
ఇదీ చదవండి: ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు.. కొనుగోలులో జాప్యమే కారణమా..?