నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏమీ చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. జమ్మికుంటలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడేళ్ల కాలంలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తన సొంత పనుల కోసమే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేవారు తప్ప... నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను ఎన్నడూ అడగలేదన్నారు. అయితే తామంతా నియోజకవర్గ పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే రూ. 31 కోట్లు మంజూరు చేశారని... సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ మాదిరిగానే జమ్మికుంటను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోనే విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి గంగుల అన్నారు.
జమ్మికుంటలో రోడ్లన్నీ దుర్భరంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఈ ఏడేళ్లలో ఏం అభివృద్ధి చేశారు. ఈటల రాజేందర్‌ను రెండోసారి గెలిపిస్తే.. ముఖ్యమంత్రిని అడిగి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చుకోవాలి కదా.. రెండు సార్లు మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆలోచించాలి.
- గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి.
ఏడేళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి
దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పింఛన్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు సహా పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతోంది. ఏడేళ్ల పాలనలో 70 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ మాత్రమే. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయి.
-కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి.
ఇదీ చూడండి: SEETHAKKA: 'రేవంత్ నియామకంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చింది'