రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలపర్చాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హుజూరాబాద్‌లో ఆయన స్వయం సహాయక సంఘాల సమావేశం నిర్వహించి.. బ్యాంకుల నుంచి రావాల్సిన నిధుల గురించి సమీక్షించారు. ప్రజలంతా తెరాస పథకాలను మెచ్చుకుంటుంటే మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ ఆ పథకాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలోనే అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
సీరియళ్లు పూర్తిగా చూసేవారా..?
గతంలో కరెంట్ సౌకర్యం లేక రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉండేదని మంత్రి చెప్పుకొచ్చారు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఉండేదన్నారు. మహిళా అభిమానులు గతంలో సీరియళ్లను పూర్తిగా చూడగలిగారా అని ప్రశ్నించారు. తెరాస హయాంలో సీరియళ్లను చూడగలుగుతున్నారని అన్నారు.
''భాజపా పాలిత రాష్ట్రాల్లో గంట సేపు కరెంట్ పోని రాష్ట్రమేదైనా ఉందా..? ఓ వైపు కరెంట్ సౌకర్యం మరోవైపు రైతుబంధుతో.. రైతుల పంట పండుతోంది. తెలంగాణ రాష్ట్రం.. భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.'' -గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఇదీ చదవండి: BONALU: ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!