ఉప ఎన్నికల తుదిబరిలో నిలిచేదెందరనేది నేడు తేలనుంది. నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ నేటి సాయంత్రం జరగనుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన ఈటల రాజేందర్ భార్య జమున ఉపసంహరించుకున్నారు. నామినేషన్ వేసిన 61 మందిలో 42 మంది నామపత్రాలు మాత్రం సక్రమంగా ఉండటంతో వారిలో ఎంతమంది ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తారనేది తేలనుంది. మంగళవారం ఒక్కరు కూడా వైదొలగలేదు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యవధి మాత్రమే ఉంది. ఈలోగా ఇదివరకే నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలంటే నేరుగా వచ్చి సంతకం పెట్టి నామపత్రాల్ని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి ముగ్గురితోపాటు 32 మంది స్వతంత్రులు, ఏడుగురు ఇతర పార్టీల సభ్యులు రంగంలో ఉన్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి వస్తుందోనని జిల్లా ఎన్నికల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పోటీలో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థుల వివరాల్ని మాత్రమే పొందుపర్చాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 42 మందిలో ఒక వేళ సగం మంది ఉపసంహరించుకున్నా రెండో ఈవీఎం బ్యాలెట్ ఏర్పాటు అనివార్యం. ఒకవేళ పోటీలో కచ్చితంగా 32 మంది ఉంటే.. నోటాతో కలిపి మూడు ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. రెండు బ్యాలెట్లలో అభ్యర్థుల ఫొటోలు, పేర్లు, గుర్తులు ఉండనుండగా మూడో ఈవీఎంలో నోటాను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. 31 మంది ఉంటే విధిగా రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. ఇప్పటికే వారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కొన్నింటిని ఎంపిక చేసుకోగా.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను బట్టి వారికి వాటిని కేటాయించనున్నారు.
ఇదీ చదవండి: Harish Rao Challenge: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఈటలకు హరీశ్‌రావు ఛాలెంజ్!