ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో సాఫీగా సాగుతున్న డయాలసిస్ సేవలకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 41 కేంద్రాల్లో డీమెడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందిస్తోంది. కరీంనగర్ డయాలసిస్ కేంద్రంలో ప్రతినెలా దాదాపు 100 మందికి రక్తశుద్ధి చేస్తుంటారు. ఒక్కసారి డయాలసిస్‌కు రూ.1,375 ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా డీమెడ్ సంస్థకు చెల్లిస్తారు. ఇలా ఒక్కో రోగికి నెలకు సుమారు 13,750 చెల్లించాల్సి ఉంటుంది.
గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. వారం గడిస్తే డయాలసిస్‌కు అవసరమయ్యే వైద్య సామగ్రి ఉండదని కరీంనగర్ డయాలసిస్ కేంద్రంలో సిబ్బంది చెబుతున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
డయాలసిస్ కోసం వచ్చే వారంతా పేదవారేనని నిర్వాహకులు చెబుతున్నారు. మూడేళ్లుగా రక్తశుద్ధి సాఫీగా సాగుతోందన్న నిర్వాహకులు.. గత 4 నెలలుగా నిధులు రావడం లేదని వెల్లడించారు. నిధులు రాకుంటే ఇకపై సేవలు నిలిపివేసే ప్రమాదముందన్నారు. నిధుల లేమితో రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని..త్వరగా నిధులు విడుదల చేయాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీచూడండి: 'బయటి కంటే ఇంట్లోనే మహిళలకు ఎక్కువ హింస'