KTR Inaugurated Cable Bridge at Karimnagar : కరీంనగర్ రూపురేఖలు మారబోతున్నాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 224కోట్ల రూపాయలతో మానేరు వాగుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం దాదాపు అరగంట పాటు క్రాకర్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్... రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు.
KTR Speech at Karimnagar Cable Bridge Inauguration : కరీంనగర్ అభివృద్ది చూస్తే ప్రతిపక్షాల గుండెలు ఝల్లుమనే పరిస్థితి ఉందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు 224కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జియే కాకుండా మరో 480కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ నిర్మించాలని ఎప్పుడైనా ఆలోచించారా అని మంత్రి ప్రశ్నించారు. అప్పర్ మానేరు, గూడవెల్లి వాగు నుంచి మొదలుకొని 180కిలో మీటర్లు ప్రవహించి మంథని దగ్గర గోదావరిలో కలుస్తున్న మానేరు వాగు సజీవ నదిగా మారబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. 24గంటలు తాగునీళ్లు అందించే మొట్టమొదటి నగరం కరీంనగర్ కావాలన్న పట్టుదలతో పనిచేస్తున్న మంత్రి గంగులను కేటీఆర్ అభినందించారు.
అభివృద్దికి ఆకాంక్షించే వారిని ఆశీర్వదించండి : కేబుల్ బ్రిడ్జ్‌తో పాటు పది ఎకరాల్లో బ్రహ్మాండమైన గుడి నిర్మాణం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ది గుండెకు తడుతుందని... అభివృద్దికి ఆకాంక్షించే వారిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. కరీంనగర్‌లో స్వచ్ఛ వాహనాల సంఖ్య పెరిగిందన్న మంత్రి... ఆ దిశగా మరింత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో పాలుపంచుకున్న వారికి మంత్రి చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. అంతకుముందు కరీంనగర్ నగరపాలక సంస్థలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతాలకు తగ్గిన దూరం : ఈ కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలకు... దూరాభారం తగ్గనుంది. 2018 ఫిబ్రవరి 19న 183 కోట్ల అంచనా వ్యయంతో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు. తర్వాత నిర్మాణంలో మార్పులు, భూసేకరణ తదితర కారణాలతో... 224 కోట్లతో తుది మెరుగులు దిద్దుకుని బుధవారం ప్రారంభమైంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో... జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్, విజయవాడ వెళ్లడానికి 7 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు.. ఆరు కోట్ల రూపాయలతో డిజిటల్ లైటింగ్, రెండు పెద్ద తెరలు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: