కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం(cm kcr family) బంగారుమయం అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలోని శ్రీరాములపల్లిలో రోడ్ షో నిర్వహించిన కిషన్‌రెడ్డి(Kishan reddy Campaign)... తెరాస పాలనపై విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో(Huzurabad by elections 2021) ధర్మానికి, అధర్మానికి మధ్యన పోటీ జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన రావాలంటే హుజూరాబాద్‌లో భాజపా గెలవాలని కిషన్ రెడ్డి కోరారు.
న్యాయానికి, అన్యాయానికి మధ్య ఎన్నికలు
న్యాయానికి, అన్యాయానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని... హుజూరాబాద్ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy Campaign) అన్నారు. 'బానిసలు కావాలా... మీ గొంతుక వినిపించే ప్రజాప్రతినిధులు కావాలా?' అని ప్రశ్నించారు. 'ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే వారు కావాలా.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వ్యక్తులు కావాలా?' అని కిషన్ రెడ్డి రోడ్‌షోలో ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలంటే భాజపా గెలవాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవాలంటే భాజపా గెలవాలని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నీతి, నిజాయతీ గల వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ఇవాళ డబ్బులు పంచే నాయకులెవరూ ఎన్నికల తర్వాత ఉండరని... కేవలం ఈటల రాజేందర్ మాత్రమే ఉంటారని తెలిపారు. ఒలింపిక్స్‌లో క్రీడాకారుడు నీరజ్ చోప్డా ఈటె వేసి బంగారు పతకం సాధించారని... హుజూరాబాద్‌లోనూ ఈటల రాజేందర్ ఈటెను వదిలి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన ఉండాలా? పోవాలా? మనమందరం ఆలోచన చేయాలి. తెలంగాణ తెచ్చుకున్నది ఒక కుటుంబం కోసం కాదు. బంగారు తెలంగాణ చేసుకోవడం కోసం. కానీ ఈరోజు బంగారు తెలంగాణ కాలేదు కానీ బంగారు కేసీఆర్ కుటుంబమైంది. తెలంగాణలో నియంతృత్వ పాలన ఉంది. నిజాం పాలన ఉంది. కుటుంబ పాలన ఉంది. నిర్బంధ పాలన ఉన్నది. ప్రజావ్యతిరేక పాలన ఉన్నది. ప్రజా సంఘాల పాలన లేదు. అందుకే ఆలోచన చేయాలి. బానిసలు కావాలా... మీ గొంతులు వినిపించే వ్యక్తులు కావాలా?. ఆలోచించండి. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే వారు కావాలా.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టేవారు కావాలా?. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన కావాలంటే హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలి.
- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
తెరాస ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. అసత్య ప్రచారాలు చేసినా హుజూరాబాద్‌లో భాజపా విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(kishan reddy About Huzurabad by poll) హనుమకొండలో నిర్వహించిన ప్రెస్మీట్లో ధీమా వ్యక్తం చేశారు. తెరాస కుటుంబ పాలన పోవాలని హుజురాబాద్(Huzurabad by elections 2021) ప్రజలు కోరుకుంటున్నారని హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. దశల వారీగా తెరాస డబ్బులు పంచుతోందని ఆరోపించిన కిషన్ రెడ్డి... భాజపా గెలుపునకు సంబంధించి ఎంత మెజారిటీ అన్నదే చూస్తున్నామని చెప్పారు. భాజపా గెలుపుతో రాష్ట్రంలో అధికార మార్పుకు మరో అడుగు పడుతుందని వెల్లడించారు. ఈసీ అనుమతి తీసుకొని ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకోవడాన్ని ఖండించిన కేంద్రమంత్రి... హుజురాబాద్‌లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: kishan reddy : హుజూరాబాద్ తీర్పు.. రాష్ట్రంలో అధికార మార్పునకు సంకేతం కాబోతోంది