రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని ఊర చెరువు నిండుకుండలా మరి మత్తడి పోస్తోంది. నవాబుపేట సుందరగిరి రహదారి వరద నీటికి కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేకొండ నుంచి బొమ్మనపల్లి మొగిలిపాలెం కరీంనగర్ కు వెళ్లే రహదారి మధ్యలో కాలువపై ఉన్న వంతెన వరద నీటికి కొట్టుకుపోయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి చిగురుమామిడి మండలంలోని వరదనీటి ప్రభావంతో కొట్టుకుపోయిన రహదారులను, దెబ్బతిన్న చెరువులను, కాలువను, నీట మునిగిన పంటలను పరిశీలించారు. దెబ్బ తిన్న రహదారులు, చెరువులతో పాటు కాల్వలకు మరమ్మతులు చేయించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.