కరీంనగర్‌లోని విద్యానగర్‌లో హత్యకు గురైన ముత్త రాధిక కేసును దిశ, సమత కేసుల తరహాలోనే విచారిస్తున్నట్లు ఇంఛార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మృతురాలి ఇంటిని పరిశీలించిన ఇంఛార్జి సీపీ... హత్యకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. గతంలో రాధిక ఒకరి ప్రేమను తిరస్కరించినట్లు కుటుంబసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మృతురాలి తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తారన్నారు.
దొంగతనాన్ని అడ్డుకొనేందుకు హత్య జరిగిందా... లైంగికదాడికి అడ్డుకున్నందుకా అన్న అంశాలను విచారించేందుకు ప్రత్యేకంగా 8 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఘటన జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కృషి చేయటమే కాకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సీపీ తెలిపారు. ఇప్పటికే అనుమానితులుగా ఉన్న నలుగురిని విచారించామని... దాదాపు 60శాతం వరకు కేసును ఛేదించామని ఇంఛార్జి సీపీ తెలిపారు.
ఇదీ చూడండి : ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్టు