ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణ, పల్లె ప్రజలు వణుకుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, పెంకుటిళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వర్షం జోరు తగ్గకపోవడంతో పాత ఇళ్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు నాలుగైదు చోట్ల ప్రహరీలు కూలిపోయాయి.
ఆగమేఘాల మీద చర్యలు...
మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పురపాలిక పరిధిలో విలీనమైన గ్రామాల్లోని పాత ఇళ్లను వరద నీరు ముంచెత్తి పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని చోట్ల ఇప్పటికే పాక్షికంగా దెబ్బతిని నేలమట్టమైయ్యాయి. నగరంతో పాటు పట్టణాల్లోనూ పాత ప్రహరీలు పెంకుటిళ్లను గుర్తించేందుకు ఆగమేఘాల మీద అధికారులు చర్యలు చేపట్టారు. పాత ఇళ్లను గుర్తించి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా నోటీసులు జారీ చేస్తున్నారు.
ఆదివారం నుంచి నోటీసులు...
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో విలీనమైన కాలనీలతో పాటు నగరంలో 137 నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం నుంచి ఆయా గృహాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వెంటనే సహాయం అందించేందుకు వీలుగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.
కాల్ సెంటర్ ఏర్పాటు...
ఇప్పటికే విపత్తు నిర్వహణ సిబ్బంది 24 గంటల పాటు 44 మంది సిబ్బందితో వర్షా ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు పనులు చేపడుతున్నారు.
0878-2200100కి ఫోన్ చేయండి..
ఇందుకోసం 0878- 2200100 నెంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. నగరంతో పాటు పలు కాలనీల్లో శిథిల భవనాలు గుర్తించామని డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాష్ తెలిపారు. నోటీసులు ఇచ్చి కూల్చివేసేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రమాదకరంగా ఉన్న ఇళ్లలో నివసిస్తే వెంటనే ఖాళీ చేయాలని కోరారు.
ఇవీ చూడండి : ఉప్పొంగుతున్న గోదావరి... 60 అడుగులకు చేరిన నీటిమట్టం