కరీంనగర్ నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులపై అవగాహన లేకుండా భాజపా నాయకులు అర్ధ రహిత విమర్శలు చేస్తున్నారని మేయర్ సునీల్‌రావు అసహనం వ్యక్తం చేశారు. గత ఆరునెలల కాలంలో దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని... రాబోయే కాలంలో మరో 60 కోట్లతో పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు.
అభివృద్ది పనుల పట్ల అవగాహన లేకపోతే కార్పోరేషన్‌లోని భాజపా కార్పొరేటర్ల సలహాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఏకకాలంలో గంటపాటు వర్షం కురిస్తే.. కరీంనగర్ నగరమే కాదు న్యూయార్క్ సిటీలోను ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం గ్రహించాలని సూచించారు.
కొవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని.. బండి సంజయ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని సునీల్‌రావు డిమాండ్ చేశారు.
- ఇదీచూడండి: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు