ఆయుర్వేద వైద్యులకు 58 శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతి ఇవ్వడం అంటే హైబ్రిడ్ డాక్టర్లను తయారు చేయడమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐఎన్ఏ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు వైద్యులు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఆయుర్వేదంపై తమకు గౌరవం ఉందని.. అల్లోపతి వైద్య విధానం గత 200 ఏళ్లలో ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా రూపొందించిన విధానమని అన్నారు.
దేశ జనాభాకు అనుగుణంగా వైద్యులు తక్కువగా ఉన్నారని నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయుష్ వైద్యులకు శస్త్ర చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వడం బాధాకరమని పవన్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు జరగబోవు నష్టం వైద్య నిపుణులే కాక సామాన్య ప్రజలపై పడుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలను వైద్యులు అందిస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులకు సమన్లు.. ఎందుకంటే..?