హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas value ) తనకు సొంత వాహనం లేదంటూ నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన కుమారుడి పేరు తారక రామారావు, కూతురు పేరు సంఘమిత్రగా వివరించారు. శ్రీనివాస్ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ రాజనీతి శాస్త్రం, ఉస్మానియా న్యాయకళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
ఆస్తుల వివరాలు
నామినేషన్ వేసే సమయానికి ఆయన వద్ద కేవలం 10 వేల నగదు, ఆయన భార్య వద్ద 5 వేల నగదు మాత్రమే ఉన్నాయి. తన పేరిట నాలుగు, భార్య పేరిట మూడు బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిల్లో శ్రీనివాస్‌కు 2.82 లక్షల నగదు డిపాజిట్లున్నాయి. భార్య వద్ద 25 తులాల బంగారు ఆభరణాలుండగా.... వాటి విలువ సుమారు 12 లక్షలుగా పేర్కొన్నారు. వీణవంకలో సొంతిల్లు, భార్య పేరిట హుజూరాబాద్‌లో 12 గుంటల స్థలం ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్‌పై ఓయూ, కొల్లాపూర్, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ముడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
తొలి నామినేషన్
ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం అధికారికంగా వెలువడటంతో తొలిరోజునే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి తదితరులతో కలిసి ఆయన హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12.50కి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డికి అందించారు. అంతకుముందు శ్రీనివాస్ ఇల్లందకుంటలోని సీతారామాలయంలో పూజ చేయించారు. తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి బయలుదేరారు.
గెల్లు ప్రస్థానం..
ఎంఏ, ఎల్ఎల్ల్బీ, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్... 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్‌పై 100కు పైగా కేసులు ఉండగా.. ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు చేశారు. రెండు సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి, చంచల్ గూడలో జైలు జీవితం గడిపారు. 2017 నుంచి టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఉపఎన్నిక వివరాలిలా...
ఇటీవలే హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) షెడ్యూల్ వచ్చింది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: Huzurabad by election: హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్