Seed Production in Huzurabad Division: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వరి మడులు తేయాకు తోటల్లా కనిపిస్తాయి. ఈసారి సాధారణ రకం కాకుండా హైబ్రిడ్ రకం వేయడంతో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. కంపెనీలు చేసే సూచనలకు అనుగుణంగానే రైతులు ఈ వరిని పండిస్తారు. పొలంలోని మడిలో ఆడ- మగ రెండు రకం విత్తనాలు వేర్వేరు వరసలో ఉంటాయి. మగ రకం వరి మొక్క ఎత్తుగాను.. ఆడమొక్కలు పొట్టిగాను ఉంటాయి. ఈ రకంలో పండించే విత్తనాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
పరపరాగ సంపర్కం: పూత దశలో ఉన్నప్పుడు మగ వరి మొక్కలపై ఉన్న పుప్పొడి రేణువులు ఆడ మొక్కలపై పడే విధంగా దులపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి విత్తనాలు మరింత నాణ్యతతో వస్తాయని రైతులు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేసేది లేదని చెప్పటం వల్లే ఈ రకం వేశామని రైతులు పేర్కొన్నారు. సాధారణ వరి సాగు కంటే.. విత్తనోత్పత్తి సాగుకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. అయినప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. ఆయా కంపెనీలే బాధ్యత తీసుకోవడంతో.. వారి సలహాల మేరకు సాగు చేస్తున్నారు.
"ఆరెకరాల్లో విత్తనోత్పత్తి సాగు చేశాను. ఎప్పుడైనా వరి సాగు చేసే వాళ్లం. యాసంగిలో వడ్లు కొనేది లేదని ప్రభుత్వం చెప్పడంతో హైబ్రిడ్ సాగు ఎంచుకున్నాం. మా మండలంలో చాలా మంది రైతులు ఇదే సాగు చేస్తున్నారు. విత్తనాలు బాగున్నాయి. పయోనీర్ కంపెనీ వాళ్లే అన్నీ చూసుకుంటారు. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం." -నీలం కుమారస్వామి, రైతు, వీణవంక
"మొత్తం మూడు దఫాల్లో మందులు చల్లుతాం. ఆ తర్వాత మగ వరి మొక్కలపై ఉన్న పుప్పొడి రేణవులు.. ఆడ మొక్కలపై పడి విత్తనోత్పత్తి జరుగుతుంది. పయోనీర్ కంపెనీ వాళ్లకే అప్పజెప్పాం. అన్నీ వాళ్ల సూచనల మేరకే సాగు చేస్తున్నాం. యాసంగిలో వడ్లు కొనేది లేదని ప్రభుత్వం చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం."
-సమ్మిరెడ్డి, రైతు, కనపర్తి
అధికంగా పిచికారీ: హుజూరాబాద్ డివిజన్‌లోని వీణవంక, శంకరపట్నం, ఇల్లందకుంట మండలాల్లోని వేల ఎకరాల్లో హైబ్రిడ్ వరిని రైతులు సాగు చేస్తున్నారు. అయితే సాధారణ వరితో పోలిస్తే అధికంగా మందులు పిచికారి చేయాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం మూడు దఫాల్లో మందులు చల్లుతామని చెప్పారు. పూత దశలో దులపడానికి అదనంగా కూలీల ఖర్చు ఉంటుందని రైతులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉగాదికి ఈసారి వేపపూత తినాలా..? వద్దా..?