కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Notification)కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈనెల 13వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. ఉపపోరుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నిబంధనలను వివరించారు.
క్రిమినల్ కేసులు ఉంటే...
పోటీ చేసే అభ్యర్థులకు నగదు రూపకంగా డబ్బులు ఇవ్వొద్దని, చెక్కులు, డీడీలు, ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా నుంచే ఎన్నికల ఖర్చు లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు. ప్రకటన విడుదలైన తేదీ నుంచి వారంలోపు ప్రచారానికి వచ్చే స్టార్ క్యాంపెయిన్‌ల జాబితాను అందించాలని సూచించారు. ఎన్నికల ఖర్చు వివరాలను రోజువారీగా ఎన్నికల పరిశీలకుడికి అందించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చులపై ఎఫ్ఎస్టీ (FST), ఎస్ఎస్టీ (SST), వీవీటీ (VVT) బృందాల నిఘా ఉంటుందని చెప్పారు. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే సమాచారం ఇవ్వాలని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.
అనుమతి లేదు...
ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను అభ్యర్థులు.. రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించాలని సూచించారు. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే 1,000 మంది వరకు ఇండోర్ సమావేశాలకు 200 మందికి మించకుండా.. సాధారణ సమావేశాలకు 500 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. రోడ్‌షోలకు ద్విచక్రవాహన ర్యాలీలకు అనుమతి లేదని వెల్లడించారు. అభ్యర్థి, అతని రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.
తొలగింపు...
నియోజకవర్గ పరిధిలోని పురపాలక సంస్థలు గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాలకు చెందిన ప్రకటనలు ఏమైనా ఉంటే తొలగించాలని.. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి (Rdo Ravinder Reddy) సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హోర్డింగులతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన బ్యానర్లను ప్రభుత్వ కార్యాలయాల వద్ద నుంచి అధికారులు తొలగించారు.