కరీంనగర్ కోతిరాంపూర్ ప్రాంతంలోని సుందరమ్మ నిలయానికి వెళ్తే.. పూలమొక్కలు స్వాగతం పలుకుతాయి. రకరకాల మొక్కలు సువాసనలు వెదజల్లుతాయి. పండ్ల చెట్లు మనసుకు ఆహ్లాదం పంచుతాయి. కావాల్సిన కూరగాయలు సొంతంగా పండించుకుంటారు. ఇంటి యజమానురాలు సుందరమ్మకు మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం. రోజూ కనీసం రెండు గంటలైనా వాటితో ప్రాణంగా గడుపుతారు. నీళ్లుపెట్టడం, కలుపుతీస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇంట్లోంచి బయటకు వెళ్తే.. ఎవరైనా వస్తువులు కొనితెచ్చుకోవడం పరిపాటే.. కానీ, సుందరమ్మ మాత్రం కొత్తకొత్త మొక్కల్ని కొనుగోలు చేస్తారు.
మొక్కలు, చెట్లు పెంచుకునేందుకు ఇంట్లో విశాలమైన స్థలం లేదనో.. మరేవో రకరకాల కారణాలు చెబుతుంటారు. సుందరమ్మ మాత్రం... మనసుంటే అలాంటి ఆలోచనే అవసరం లేదని నిరూపిస్తున్నారు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులన్నీ మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగ పడతాయని నిరూపిస్తున్నారు. టైర్లు,ప్లాస్టిక్ డబ్బాలు, సిమెంట్ కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఇక ఇంటి లోపల పాత ఇత్తడి బిందెలతో గృహాలంకరణ చేశారు. బిందెలు వృథాగా ఉంచకుండా వాటిలో మొక్కలు నాటి ఇంటిని పచ్చటితోరణంగా మార్చారు.
ఇంటి చుట్టూ నాటిన మొక్కలతో ఆక్సిజన్‌తో పాటు ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలు సేదతీరుతున్నారని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణం కలుషితమైన ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొక్కల పెంపకం అవసరమని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్ భూభాగం దురాక్రమణ