ఈ బామ్మల పేరు జనగాం ఆగమ్మ(93), గుర్రం లచ్చమ్మ(94). వీరిది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న వీరికి గత నెల 26న కరోనా సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది. అప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఆత్మస్థైర్యంతో కరోనా మహమ్మారిని జయించి గురువారం ఇలా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇద్దరూ వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు.
ఆగమ్మ కుటుంబంలో ఆమెతో పాటు కొడుకు, కోడలు, మనవడు కూడా కరోనా బారిన పడ్డారు. నలుగురికీ ఇతర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ఇంటి వద్దే ఉండి వైద్యుల సూచనల మేరకు మందులు వాడి కోలుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి దీనినుంచి బయటపడ్డానని ఆగమ్మ తెలిపారు. లచ్చమ్మకు కొంత ఇబ్బంది తలెత్తడంతో కుటుంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారం రోజులు చికిత్స పొంది.. తర్వాత శాతవాహన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో ఉండి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు, సిబ్బంది సూచనలు పాటించి కరోనాను జయించినట్లు లచ్చమ్మ తెలిపారు. అధైర్యపడకుండా.. వ్యాధి నుంచి బయటపడిన వీరిద్దరూ ఇతరులకు స్ఫూర్తిదాయకులు.
ఇవీ చూడండి: మాతృభాషలో బోధన విద్యార్థులకు ఉపయోగకరం: గవర్నర్