మాజీమంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. భాజపాలో చేరిన ఈటల తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శామీర్‌పేటలోని తన నివాసం నుంచి భాజపా నేత గడ్డం వివేక్‌తో కలిసి జమ్మికుంట మండలం నగరం గ్రామానికి బయల్దేరిన ఈటలకు అడుగడుగునా నీరాజనం పలికారు. బయల్దేరారు. హుజూరాబాద్ మండలం కాట్రపల్లి వద్ద స్థానిక భాజపా నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. భాజపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. గ్రామానికి చెందిన పలువురు తెరాస కార్యకర్తలు వారి సమక్షంలో భాజపాలో చేరారు.
అక్కడి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీతో హుజూరాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మాజీ మంత్రి ఈటల, వివేక్, భాజపా జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. హుజూరాబాద్‌లో ప్రజలకు అభివాదం తెలుపుతూ రోడ్ షో నిర్వహించారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట మీదుగా నగరం గ్రామానికి బయల్దేరారు. తెరాస పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇటీవల భాజపాలో చేరి హుజూరాబాద్‌లో పర్యటించటంతో స్థానిక నేతల్లో హుషారును కలిగించింది . కాట్రపల్లి ,నర్సింగాపూర్ ,హుజురాబాద్ ,రాంపూర్ ,చెల్పూర్ ,శాలపల్లి ,జమ్మికుంట ,కొత్తపల్లి ,ధర్మారం ,శాయంపేట ,నాగులపేట ,గండ్రపల్లి ,సణుగుల గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసు నిఘాను ఉంచారు.
ఇదీ చదవండి: vaccination: వ్యాక్సిన్ కావాలంటే సిరంజీలు మీరే తెచ్చుకోండి..!