ఆనందోత్సాహాల మధ్య చిన్నారి పుట్టిన రోజును జరుపుకుంటున్న నాగుల రమేశ్-శారదల కుటుంబాన్ని చూసిన విధికి కన్నుకుట్టింది. ఆరునెలల క్రితం ఇంటిపెద్ద రమేశ్‌ను గుండెపోటుతో పరలోకానికి తీసుకెళ్లగా.. అనారోగ్యంతో శారదను మూడు రోజుల క్రితం విధి ఈలోకాన్ని వదిలిపెట్టేలా చేసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడవల్లిలో చోటుచేసుకున్న.. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.
దిక్కు కోసం గుక్కపట్టి..
చిన్న కుటుంబమైనప్పటికి హోటల్‌తోపాటు.. ఆటోను నడుపుతూ రమేశ్ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో ఇంటి పెద్ద రమేశ్‌కు మరణంతో కుదుపు వచ్చినట్లు అయింది. తండ్రి మృతితో అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని కోల్పోయిన.. 11 ఏళ్ల అభినయతోపాటు 9 ఏళ్ల ఆలయ సాయం కోసం గుక్కపట్టి ఏడ్చే పరిస్థితి నెలకొంది. ఇంట్లో పెద్దలు ఎవరూ లేకపోవడం వల్ల చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోను చేతుల్లో పట్టుకుని ఏడుస్తున్నారు. అన్నం పెడితే ఒకరికి ఒకరు తినిపించుకుని మరొకరు ఓదార్చుకుంటున్నారు. చిన్నాన్న, పెద్దనాన్న ఉన్నప్పటికి తమ పిల్లలనే తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నామని చేతులెత్తేశారు. చనిపోవడమంటే ఏమిటో తెలియని ఆ చిన్నారుల అమ్మనాన్న చనిపోయారు. మాకు గవర్నమెంటు వాళ్లు ఆదుకోవాలని... హాస్టల్‌లోనైనా ఉంటామని వారు చెప్పడం చూసిన వారి గుండెలు కరిగిపోతున్నాయి.
ఆదుకోవాలని విజ్ఞప్తి..
ఆరు నెలల్లో అన్నా వదినలు చనిపోయారని సోదరుడు శివకుమార్ కంటతడి పెట్టారు. ఇద్దరు చిన్నారులకు ఎవరూ పెద్దదిక్కులేరని. తనకు కూడా వారిని పోషించే స్తోమత లేదని వాపోయారు. ఇప్పటికే తన ఆర్థిక స్థితి అంతంత మాత్రమేనని అన్నారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికే అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇద్దరు చిన్నారుల స్థితిని చూసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇంకా ఊహ తెలియని వయస్సులో అనాథలుగా మారిన ఆ ఇద్దరిని ఆదుకునేందుకు.. ఓ పెద్దమనసు ముందుకు రాకపోదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమైనా దయతలచి వచ్చి ఇద్దరు చిన్నారులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి : ఘాటెక్కిన మసాలాలు... ఎండుఫలాల ధరలూ పైపైకే