ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నగర, పురపాలికలు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతిలో ప్రత్యేక నిధులతో పాటు ఆర్థిక సంఘం కింద నిధులు ప్రతినెలా విడుదలవుతున్నాయి. దీనికి తోడుగా 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా జనాభా ప్రాతిపదికన మంజూరు అవుతున్నాయి. పట్టణాల్లో కనీస మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రణాళికలు తయారు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీటి సరఫరా, రోడ్లు, హరితహారం కార్యక్రమం వంటివి చేపట్టేందుకు వీలుగా నిధులు మంజూరు చేస్తోంది.
కేటాయింపు ఇలా..
ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించుకోవడానికి, అభివృద్ధికి నోచుకొని శివారు ప్రాంతాలాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు ఎంతోగానో ఉపయోగ పడనున్నాయి. ప్రతినెలా ప్రభుత్వం ప్రతీ మున్సిపాలిటీకి రూ.11.52లక్షల నుంచి మొదలుకొని అత్యధికంగా రూ.2.44కోట్లు మంజూరు చేస్తుంది. ఈ నిధులు గత ఏడు నెలలుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 16పుర, నగరపాలికల్లో సుమారు రూ.69.55కోట్లు ఉన్నాయి.
పాలకవర్గాల తీర్మానం మేరకు..
ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ సబ్‌ప్లాన్, ఎల్‌ఆర్‌ఎస్ మిగులు మొత్తం వినియోగించుకోవడానికి పాలకవర్గాల తీర్మానం తప్పనిసరి. అయితే పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులు, సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆయా అధికారులతో ప్రతిపాదనలు తీసుకొని అంచనాలు తయారు చేశారు. ఈ అంచనాల ప్రకారం ఆయా పుర, నగరపాలికలు తీర్మానం మేరకు వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. కరీంనగర్ నగరపాలక పరిధిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించారు. మిగతా పనులు చేసేందుకు త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పలికే అవకాశం ఉంది.
ఈ పనులు చేయాలి
* పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం కొత్త వాహనాల కొనుగోలు
* వీధుల్లోని రహదారులు మెరుగు పర్చుకోవడం
* హరితహారంలో మొక్కలు నాటడం
* తాగునీటి సమస్యల పరిష్కారానికి సదుపాయాల కల్పన
* శ్మశాన వాటికలకు స్థలాల గుర్తించి అభివృద్ధికి ప్రణాళికలు
* కూరగాయల మార్కెట్లు, మాంసం, చేపల మార్కెట్లు నిర్మించడం
* డంపింగ్‌యార్డుకు స్థలాల గుర్తించడం, చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడం
* ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మించడం
* వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రత్యేక వసతి, జోన్ల ఏర్పాటు
* పట్టణాల్లో పార్కింగ్ స్థలాలు గుర్తించడం
* విద్యుత్తు సంబంధ సమస్యలను గుర్తించి పనులు చేయించడం
ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!