మొక్కల్ని నాటడమంటే సాదాసీదాగా నాటేస్తే ఫలితమేంటి..? ఏం చేసినా కాస్త భిన్నంగా కనిపించాలనేలా కరీంనగర్ పోలీసులులు చొరవ చూపించారు. విదేశీ పరిజ్ఞానాన్ని ఆచరించి చూపించారు. పర్యావరణహితుడిగా పేరొందిన గొప్ప శాస్త్రవేత్త విధానాల్ని అమలుచేశారు. అందుకే ఇలా సరికొత్త చిట్టడవిని అనతికాలంలోనే సృష్టించి భావితరాలకు మేలు చేసేలా బాటలు వేస్తున్నారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి చొరవతో ఆదర్శంగా మారుతున్నాయి ‘మియావాకి చిట్టడవులు’.
ఆలోచన పుట్టిందిలా..!
రాష్ట్రంలోనే అతితక్కువ అటవీ విస్తీర్ణం(0.16 శాతం) ఉన్న జిల్లా కరీంనగర్... ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ చిట్టడవుల ప్రాధాన్యతను భావితరాలు గుర్తించాలనే ఆలోచనతో కరీంనగర్ పోలీసులు మియావాకీ విధానాన్ని ఎంచుకున్నారు. పట్టణంలోని సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉన్న ఎకరం స్థలంలో 12 వేల మొక్కల్ని గతేడాది హరితహారం సమయంలో నాటారు. జపాన్ వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ దశాబ్దాల కిందట చిట్టడువులను పెంచడానికి ఒక విధానాన్ని రూపొందించారు.
దేశవ్యాప్తంగా పేరొందిన పట్టణాల్లో మియావాకీ పద్ధతిలో చిట్టడవుల్ని పెంచుతున్నారు. సమీప సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ దగ్గర ఈ విధానంతో పెంచిన చెట్లు నాలుగేళ్లలో ఏపుగా పెరిగి అటవీ ప్రాంతంగా మారిన తీరుతో కరీంనగర్ పోలీసులు స్ఫూర్తి పొందారు. అటవీశాఖ సహకారంతో 12 రకాల మొక్కల్ని పెంచి ఏడాది కాలంలోనే ఏపుగా పెరిగేలా చేశారు. ఇదే తరహాలో ముందుకెళ్తే మరో రెండేళ్లల్లో నగరసమీపంలోనే ఓ చిట్టడవి సాక్షాత్కరమిచ్చే వీలుంది.
ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ..
ప్రతేడాది జిల్లాలో ఆయా శాఖలు హరితహారం కార్యక్రమంలో పాల్గొంటుండటం..పోలీసుశాఖ తరపున వీలైనన్ని ఎక్కువ మొక్కల్ని పెంచాలనే సంకల్పించడంతో గతేడాది అన్ని ఠాణాల్లో విరివిగా మొక్కలు పెంచారు. ఇంకా ప్రత్యేకంగా నిలవాలనే ఆశయంతో కరీంనగర్‌లోని కమిషనరేట్ ఆవరణతోపాటు పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ తరహా ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఈ మొక్కల్ని పెట్టించే కార్యక్రమంలో పోలీసులంతా ఒకే రోజున 12 వేల మొక్కల్ని పెట్టారు. మియావాకీ విధానం ప్రకారం మొక్కల మధ్య ఎడం మొదలు పెంచే విధానంలో ఆధునాతన తీరుని అవలంభించారు. ఎండతగిలేలా మొక్క మొక్కకు మధ్య భిన్నమైన ఎత్తులో ఉండేవాటిని ఎంచుకుని ప్రయోగాత్మకంగా నాటారు. మట్టిని తవ్వడం, కొత్తమట్టిని వేయడం, సూక్ష్మసేద్యంతో నీటితడుల విధానాలు సహా ఇతరత్రా పర్యవేక్షణలతో ప్రత్యేక శ్రద్ధను చూపించారు. పీీస్ ఆండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మొక్కల మధ్య కలుపును తీసేందుకు కృషిచేశారు. దీంతో ఏడాది కాలంలోనే సాధారణ పద్ధతిలో పెరిగే మొక్కలకన్నా ఇక్కడి చిట్టడవిలోని మొక్కలు ఊహించని విధంగా ప్రగతిని అందుకున్నాయి. ఈ తీరుని చూసి ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ ట్విటర్‌లో కరీంనగర్ పోలీసుల కృషిని..మియావాకీ విధానాన్ని ప్రశంసించారు. ఇదే తరహాలో రాష్ట్రస్థాయి అటవీశాఖ అధికారులు పలు రకాలుగా కితాబునిస్తున్నారు.
భావితరాలకు మేలు చేయాలని
కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్ జిల్లా
పర్యావరణానికి అమితంగా మేలు చేసేలా ఈ చిట్టడవులుంటాయి. అబ్దుల్‌కలాం చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కొత్త విధానంతో మొక్కలను చెట్లుగా మార్చాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. మా పోలీసుల సహకారంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. భావితరాలకు మనం ఇచ్చే ఆరోగ్యకర వాతావరణం ఇలాంటి హరితవనాల రూపంలోనే ఉంటుందనేది నా భావన. అందుకే వీలైనన్ని ఎక్కువగా మొక్కల్ని నాటి వాటి సంరక్షణ దిశగా అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నాం. మున్ముందు మరిన్ని చోట్ల ఈ తరహా ప్రయోగాలు చేస్తాం.