కరీంనగర్ రీజియన్ పరిధిలో పది డిపోలుండగా మొత్తం 841 బస్సు సర్వీసులు నిత్యం 3లక్షల 42వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. 2లక్షల 56వేల మంది ప్రయాణీకులను చేరవేస్తుంటాయి. దీనికిగాను ప్రతిరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 71లక్షల రూపాయల డీజిల్‌ను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. నిత్యం సగటున 65 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీ.. నేరుగా చమురు కంపెనీల నుంచి టోకుగా కొనుగోలు చేసేది. టోకుగా సరఫరా చేసే డీజీల్ ధరలు అమాంతం పెరగడంతో.... ఫిబ్రవరి 17 నుంచి రిటైల్‌లో కొంటున్నారు. కరీంనగర్‌లోని.. రెండు బంకులతోపాటు హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల, గోదావరిఖని, మంథని డిపోలలోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.
కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీతోపాటు అద్దె బస్సులు మొత్తం ప్రతిరోజు 2లక్షల56వేల ప్రయాణీకులను చేరవేస్తుండటంతో సంస్థకు 1.13కోట్ల రూపాయల రాబడి వస్తోంది. అయితే ఇందులో సింహభాగం 71లక్షల రూపాయలు ఇంధన కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. కిలోమీటర్‌కు 22.80పైసల ఇంధనం వాడుతుండగా.. ఒక్క మార్చి నెలలోనే 21 కోట్ల రూపాయల ఇంధనాన్ని కొనుగోలు చేశారు. కేవలం సంస్థ బస్సులే కాకుండా అద్దె బస్సులకు కూడా సంస్థ ఇంధనం సరఫరా చేస్తోంది. ప్రతి బస్సు బంకుకు వెళ్లి రావటంతో కొంత డీజిల్ వృథా అయ్యే అవకాశం ఉండటంతో.. అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఆర్టీసీ డిపోల్లో డీజిల్ లభిస్తే వాహనాలకు నాణ్యత గల ఇంధనం లభించడమే కాకుండా ఆర్థిక భారం తక్కువగా ఉండేది. ఇంధన ధరలు పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణీకులు బస్సుల్లో సాధ్యమైనంత మేర అధికంగా ఎక్కే విధంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చూడండి: