Technical Problems in Rythubandhu Scheme: అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలని ముందస్తు పెట్టుబడిగా రైతు బంధు, పీఎం కిసాన్ వంటి పథకాలు తీసుకొచ్చారు. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు తీవ్ర నిరాశ చూపుతోంది. రైతుబంధు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. రైతుకు సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. సవరిస్తే సరిపోయే చిన్నపాటి సాంకేతిక కారణాలను చూపి.. నెలల తరబడి ఖాతాలో డబ్బులు వేయడం లేదు.
గత కొన్నేళ్లుగా రైతు బంధు తీసుకుంటున్న రైతులకు.. ఈ యాసంగిలో రైతుబంధు డబ్బులు జమ కాలేదు. కారణమేంటని ఆరా తీయగా.. వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఐఎఫ్‌ఎస్‌సీ నంబరు మారడంతో డబ్బులు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. డబ్బులు రాలేదన్న రైతన్నలతో మాత్రం సాంకేతిక సమస్యనే కదా.. సరైన నంబర్ పంపిస్తే వెంటనే మీ ఖాతాలో జమ అవుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. కానీ చాలా మంది రైతులకు డిసెంబరులో రైతుబంధు నిధులు వస్తే.. మార్చి నెలాఖరు సమీపిస్తున్నా కొందరికి మాత్రం ఇంకా డబ్బులు జమ కావడం లేదు.
ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం: మార్చి నెలాఖరుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో సాంకేతిక కారణాలతో ఇప్పటి వరకు జమ కాని రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వెళ్లిపోతాయేమోనన్న భయం రైతుల్లో నెలకొంది. రెండు వారాల్లో జమ అవుతాయన్న డబ్బులు.. మూడు నెలలైనా రాకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ నంబరు మారడంతో ఖాతాలో నగదు జమ కాని వారి సంఖ్య జిల్లాలో తక్కువగానే ఉందని అధికారులుపైకి చెబుతున్నా.. రాని వారి వివరాలు వెల్లడించకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
Farmers not deposited money in RythuBandhu: బాధిత రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల వద్దకు ప్రతి రోజు వెళ్లి అడుగుతున్నారు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నంబర్‌ను సరి చేసి పంపించామని.. కానీ మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడో పడతాయో చెప్పలేమంటూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఆశతో కొందరు రైతులు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్లినా.. అక్కడ సరైన సమాధానం దొరకడం లేదు. తిరిగి తిరిగి వేసారినా.. భరోసా కల్పించే వారు లేకుండా అయ్యారని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి:
రైతులకు ఎకరాకు రూ.10వేలు.. రాష్ట్ర నిధులతోనే సాయం చేస్తామన్న కేసీఆర్
రాష్ట్రంలో రానున్న 5రోజులు వడగళ్లతో కూడిన వర్షాలు..
వయసులో చిన్నవాడైన ఎంపీతో హీరోయిన్ డేటింగ్!.. రెండు రోజులు అలా దొరికిపోయి..