Crop Damage due to Untimely Rains in Telangana: వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు తీరని నష్టం మిగుల్చుతున్నాయి. గత 3 రోజులుగా ఏకధాటి వర్షంతో పాటు.. వడగళ్లు పడడంతో కామారెడ్డి జిల్లాలో రైతుల కలలు కరిగిపోయాయి. పిట్లం, బిచ్కుంద, పెద్ద కొడప్ గల్, నిజాంసాగర్, జుక్కల్, మద్నూర్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఆరుకాలం కష్టపడి పండించిన వరి రైతులు.. ధాన్యం కళ్ళముందే తడిసిపోయి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. వరి చేలునేలకు ఒరిగాయి. వడ్లు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది. వర్షం తమను నిండా ముంచేసిందని.. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలంటూ రైతులు వేడుకుంటున్నారు.
వడగళ్ల వర్షం బీభత్సం.. రైతులు తీవ్ర ఇబ్బందులు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో వడగళ్ల వర్షం భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో అన్నదాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను తీరని నష్టాల్లోకి నెట్టేసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. తంగళ్లపల్లి, రుద్రంగి, కోనరావుపేట తదితర మండలాల్లో ధాన్యం రాశులు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి.
మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం: మ్యాచర్ వచ్చి కొనుగోలు చేస్తారనుకున్న క్రమంలో ఒక్కసారిగా వర్షం కురిసి కళ్ల ముందే ధాన్యం నీటిలో తడిసిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. మార్కెట్లో సుమారు 500 క్వింటాళ్ల ధాన్యం కుప్పలకు కవర్లు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 200 క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షం.. రహదారులు జలమయం: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంటత్మకూర్, ధర్మారం గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి, మొక్కజొన్నను పరకాల, నడికూడా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఓరుగల్లు అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. త్రినగరిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. హనుమకొండలోని భవానినగర్, అశోక్ నగర్, హనుమకొండ చౌరస్తాలో భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పెరుకవాడ శివనగర్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద.. పోటెత్తిన వరదతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
పిడుగుపడి వ్యక్తి మృతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అకాల వర్షం మొక్కజొన్న రైతులకు తీరని ఇబ్బందికి గురిచేసింది. ప్రభుత్వం నుంచి మొక్కజొన్న కొనుగోలుకు సానుకూలత రావడంతో పంటను ఆరబెట్టి కొనుగోళ్లకు సిద్ధం చేయాలనుకున్న రైతులకు అకాల వర్షం తీరని దెబ్బతీసింది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో సైదులు గొర్రెలు మేపుతుండగా అకస్మాత్తుగా గాలి దుమారంతో పాటు పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవీ చదవండి: