గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిని గురించి ప్రశంసించిన వారే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తెరాస ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. తెరాస నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత పద్దెనిమిదేళ్లుగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నానని అన్నారు. హుజూరాబాద్ అభివృద్ధిపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పదవులు, ప్రలోభాల కోసం విలువలు అమ్మకోవడం తనకు సాధ్యం కాదని పునరుద్ఘాటించారు. అందుకే పదవికి రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చినట్లు వివరించారు. ఈటల రాజేందర్ గెలిస్తే ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్ బయటికొస్తారని అన్నారు. తెలంగాణ వస్తే నా ఆడ బిడ్డలకు, తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈటల రాజేందర్ విమర్శించారు.
ఈటల రాజేందర్ ఎం చేయలేదా? ఇయాళ ఈటల రాజేందర్ మధ్యలో వచ్చిండా? 2001లో పార్టీ పుడితే 2002లోనే గజ్వేల్‌లో పార్టీలో చేరిన బిడ్డను నేను. 20 సంవత్సరాల చరిత్రలో 18 ఏళ్లకు పైగా పార్టీలో ఉన్న బిడ్డను నేను. ఆనాడు సమైఖ్య పాలనలో తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని నిలబెట్టిన బిడ్డను నేను. పదవుల కోసం ప్రలోభాలకు లొంగిపోయిన నాయకుల్లారా ఇయాల చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నా హుజూరాబాద్ బిడ్డల్లారా, అన్నల్లారా నా మీద ఎలాగైతే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడ అడిగినా కూడా నా బిడ్డ మీద కేసీఆర్ పగబట్టిండు. ఎలాగైనా సరే ఈ ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటున్నరు. ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్ నేను గెలిస్తేనే ఇయాల ఆయన బయటికొస్తారు. తెలంగాణ వస్తే నా ఆడబిడ్డలందరికీ, తమ్ముళ్లకు ఉద్యోగాలొస్తాయని చెప్పిండ్రు. - ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి
ఇదీ చూడండి: Telangana Minister Harish Rao : 'రైతులపై కారెక్కించే భాజపాకు మీరు ఓటేస్తారా?'