యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్... యువకుల ఓట్లు కొందామని ప్రయత్నిస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Fire on Kcr) ఆరోపించారు. మిగతా నియోజకవర్గాల్లో అలానే గెలిచి ఉంటారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బు, మద్యానికి ఓట్లు వేయరని అన్నారు. జమ్మికుంట మండలం రామన్నపల్లిలో ఈటల రోడ్‌షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తానంటూ సీఎం కేసీఆర్... ఓట్లు దండుకొని మోసం చేశారని ఆయన విమర్శించారు. ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేద్దామనే దుష్ట ఆలోచనతో ఉన్నారని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలు అవసరమైతే కేసీఆర్‌కే డబ్బులు ఇస్తారని ఒక లిక్కర్ బాటిల్ కూడా కొని ఇస్తారని ఎద్దేవా చేశారు.
ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్(Cm Kcr)తో పాటు ఆయన అల్లుడు హరీశ్‌రావు(Harish Rao)కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
నోటిఫికేషన్లు దేవుడెరుగు. తల్లి మీద తండ్రి మీద భారం పడనీయ అని చెప్పి 2018 ఎన్నికల ముందు ప్రచారంలో నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి రూ. 3,016 ఇస్తానని వారి ఓట్లు కొల్లగొట్టింది వాస్తవం కాదా? ఒకవేళ నిరుద్యోగ భృతి వచ్చి ఉంటే ఈపాటికే ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. 80 నుంచి 90 వేలు జమ కావాలి. కానీ అయిదు పైసల బిళ్ల కూడా లేదు. ఉద్యోగం వస్తేనో లేకపోతే నిరుద్యోగ భృతి వస్తేనో ఇంత ఆసరా అవుతుందని తప్ప... ఆ పూటకు 3 వేలు, 5 వేలు డబ్బులు ఇచ్చి యువకులను చెడగొడుతున్నవు. డబ్బులకు ఓట్లు వేస్తరనే చిల్లర మనస్తత్వం కేసీఆర్‌ది. కొడంగల్, నారాయణఖేడ్, హుజూర్నగర్, నాగార్జునసాగర్‌లో గెలవచ్చు కానీ హుజూరాబాద్‌లో గెలవలేవు. ఆకలినైనా భరిస్తది ఈ గడ్డ కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోదు ఈ గడ్డ.
-- ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి
ఇదీ చదవండి: KTR latest news: కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు.. ఆ లేఖలో ఏముందంటే...