రాష్ట్రంలో ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చే పాలన నడుస్తోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. తెరాస పాలనను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనంటూ దుయ్యబట్టారు. ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మగౌరవమూ అంతే ముఖ్యమని ఈటల వ్యాఖ్యానించారు. తనకు కార్యకర్తలే ముఖ్యమని.. కులమతాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ఉద్ఘాటించారు. ఈ మాటలు మాట్లాడుతూ కాస్త తడబడ్డారు. అలవాటులో పొరపాటుగా.. ఎగిరేది గులాబీ జెండానే అని... వెంటనే సరిదిద్దుకున్నారు.
కేసీఆర్ భయపడుతున్నారు..
ఈటల స్వార్థం, రాజకీయ లబ్ధి కోసం భాజపాలో చేరలేదని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామిక విలువలు కాపాడాటానికే తెరాసకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. భాజపాలో ఈటల చేరికను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని సంజయ్ విమర్శించారు. భాజపాలో చేరేందుకు చాలామంది క్యూలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను కొట్టినవారు మంత్రిగా కొనసాగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వారందరికీ త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.
వాస్తవాలను నిర్భయంగా చెప్పేవారికి తెరాసలో స్థానం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు ఇచ్చే స్థాయి నుంచి అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. హుజూరాబాద్‌లో గెలిచేది భాజపానే అని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు, అధికారాన్ని, ప్రలోభాలను నమ్ముకున్నారన్న ఆయన.. హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కారు గుర్తుకు డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు.