హుజూరాబాద్ ఉపఎన్నికలో తెరాసకు ఓటు వెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని.. ప్రభుత్వ పథకాలను ఎవరూ ఆపలేరని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం, ఎలబాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాజపాకు ఓటు వేస్తే పెట్రోల్ ధరలు పెరుగుతాయమని దుష్ప్రచారం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుయ్యబట్టారు. పెట్రోల్ ధరలు పెరగడంలో మీ వాటా లేదా అని ప్రశ్నించారు. తమిళనాడులో స్టాలిన్ 3 రూపాయలు తగ్గించారని.. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా 30రూపాయలు తగ్గించవచ్చు కదా అని సవాల్ విసిరారు.
ఈటలకు మద్దతుగా ప్రచారం చేసిన రఘునందన్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఆత్మాభిమానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని రఘునందన్‌రావు అన్నారు. దుబ్బాకలో రఘునందన్ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని భయపెట్టారని.. గెలిచి పది నెలలు అవుతోంది మరి నిజంగా పెట్టారా ఒక్కసారి ఆలోచించాలన్నారు. అబద్ధాల పునాదుల మీద ఆ పార్టీ నిర్మాణం సాగుతోందని దుయ్యబట్టారు. వరి మేమే కొంటామని ప్రచారం చేశారు కదా.. మరి ఇప్పుడు ఎందుకు కొనరని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనాలి లేదంటే.. బండి వెనుక బండి కట్టి ఫామ్‌హౌస్‌లో పోసి కొనేదాక వదిలిపెట్టమని రఘునందన్‌రావు హెచ్చరించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులందరి తరఫున సీఎం కేసీఆర్‌ను మరోసారి డిమాండ్ చేస్తున్నానని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
పువ్వు గుర్తోళ్లు గెలిస్తే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని మంత్రులు ప్రచారం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌లో మీరు ఒక్క రూపాయి తీసుకుంటలేరా?. తమిళనాడులో కొత్తగా ఎన్నికైన స్టాలిన్ పెట్రోల్ లీటరుకు 3రూపాయలు తగ్గించిండు. పేద రాష్ట్రమైన తమిళనాడు రూ.3 తగ్గిస్తే.. ధనిక రాష్ట్రమని కేసీఆరే చెప్పిండు కదా. మరి 30 రూపాయలు తగ్గించవచ్చు కదా. దుబ్బాకలో కూడా ఇట్లనే చెప్పిండు. రఘునందన్ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడుతరన్నరు. ఏది పది నెలలు అవుతుంది గెలిచి మీటర్లు పెట్టినమా. అబద్ధాల పునాదుల మీది ఆ పార్టీ నిర్మాణం సాగుతోంది. ప్రతి గింజ మేమే కొంటామన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు కొనరు. -రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇదీ చదవండి: Balmuri Venkat: సమస్యలపై పోరాడేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి: బల్మూరి వెంకట్