హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికపై సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. తాను రాజీనామా చేసి ఐదు నెలలు అయిందని.. మరో నెలలో నియోజకవర్గ ప్రజల ఎంపిక ఎవరో తేలిపోతుందని తెలిపారు. ఐదు నెలల నుంచి.. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి, రంగనాయకసాగర్ నుంచి మంత్రి హరీశ్ రావు, ఇతర జిల్లాల మంత్రులు తమ పనులు వదులుకుని మరీ.. హుజూరాబాద్‌లో తిష్టవేశారని చెప్పారు. ఈ ఐదు నెలల్లో తెరాస అనేక అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తనకు మద్దతిస్తున్న వాళ్లందరికి రకరకాల కారణాలతో బెదిరింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఎంత బెదిరించినా.. ఎన్ని రకాలుగా భయపెట్టినా.. మరెన్నో రకాల ప్రలోభాలకు గురి చేసినా.. తొణకుండా.. జంకకుండా నియోజకవర్గ ప్రజానీకం తనకు అండగా నిలిచిందని ఈటల స్పష్టం చేశారు. వాళ్లందరికి శిరస్సు వంచి నమస్కరించారు.
తాను పదవిలో ఉన్నప్పుడు పేదలు, వితంతువులు వంటి అవసరాల్లో ఉన్న వారికి అండగా ఉంటుందని చిన్నచిన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించానని.. వాళ్లందర్ని పార్టీ కండువా కప్పుకోవాలని బెదిరించారని ఈటల ఆరోపించారు. తెరాసకు జంకకుండా ఉన్న వారు కొందరైతే.. తమ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మరికొందరు ఇష్టం లేకపోయినా కండువా కప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు. నిజంగా ప్రజలపై తమకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా పోటీలో గెలవాలని తెరాసకు సవాల్ విసిరారు.
"నియోజకవర్గంలోని గ్రామాలు దావత్‌లకు అడ్డాలుగా మారాయి. ఈ దావత్‌లలో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులే పాల్గొంటున్నారు. స్వయంగా వారే మందు పోస్తున్నారు. తెరాస నేతలు ఇంత నీచానికి దిగజారుతున్నారు. దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడి గెలవండి. అంతేకానీ.. నా వెంట వచ్చే వాళ్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి కాదు."
- ఈటల రాజేందర్, భాజపా నేత
18 ఏళ్లు నియోజకవర్గానికి, ప్రజలకు తాను చేసిన సేవ ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని ఈటల అన్నారు. తాను చేసిన సేవే తనను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం సాగుతోందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో భాగమయ్యారనే విమర్శలున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తమకు తెలియకుండానే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని సూచించారు. హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అక్రమంగా సంపాదించిన డబ్బంతా లారీల్లో దింపుతున్నారని ఆరోపణలు చేశారు. ఆ డబ్బుకు ఎదురొడ్డి నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.