ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన తమ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఖండించారు. తమ వారిపై దాడులకు దిగడం ఏమాత్రం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. మా జోలికి రావద్దు... మీ ప్రచారం మీరు చేసుకోండి అని అన్నారు. ఈ దాడులు మీరు ఈనెల 30వరకు చేస్తారు. ఆ తర్వాత సిద్దిపేట, హుస్నాబాద్‌లో జరుగుతాయి.. గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. సింగాపూర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరపై ఆధారపడి ఉండదా అని ప్రశ్నించారు. పెట్రో.. డీజిల్‌పై రాష్ట్రప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తుందో చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఇక సహించేది లేదని హెచ్చరించారు.
నిజం బయటకు రాక తప్పదు
దళితబంధు తాము ఆపుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. తాత్కాలికంగా నిజం ఓడిపోయినా.. నివురు గప్పినా నిప్పులా తప్పకుండా బయటకు వస్తుందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణలో దళితుడినే సీఎం చేసి కాపలాగా ఉంటానని మోసం చేశారని దుయ్యబట్టారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని 'దళిత ప్రైడ్' అనే స్కీం పెట్టి మూడున్నర ఏళ్లుగా రుణాల సబ్సిడీ ఇవ్వకుండా చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. సీఎం మోసాన్ని గ్రహించకుండా కొంత మంది మేధావులు వాటిని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధుపై సంపూర్ణ అధికారం కలెక్టర్లకు కాకుండా లబ్ధిదారులకే ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: kishan reddy : హుజూరాబాద్ తీర్పు.. రాష్ట్రంలో అధికార మార్పునకు సంకేతం కాబోతోంది