ఎన్నికల పోలింగ్ సమయానికి 72 గంటలముందే ప్రచారం ముగించాలని రాజకీయ పార్టీల అభ్యర్థులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్ సూచించారు. ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా ఉప ఎన్నికల నిర్వాహణపై సమావేశం నిర్వహించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా నిర్వహించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే నిర్వహించాలని అన్నారు. ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని.. జిల్లా మొత్తం ఉండదని తెలిపారు. నియోజకవర్గం బయట ఎన్నికల సమావేశాలు నిర్వహించుకుంటే తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో సీపీఐ, భాజపా, సీపీఎం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు.
నెగెటివ్ రిపోర్టు ఇస్తేనే అనుమతి
ఉప ఎన్నికలో అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్లు, డ్రైవర్ కొవిడ్ నిబంధనల ప్రకారం 72 గంటలలోపు ఆర్టీపీసీఆర్0 నెగెటివ్ రిపోర్టు సమర్పిస్తే అనుమతిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. అలాగే ఒక డోసు కూడా కొవిడ్ టీకా తీసుకోకుండా ఉన్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్లు, డ్రైవర్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు 48 గంటల లోపు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే అనుమతిస్తామని సూచించారు.
ఇదీ చూడండి: అత్యంత ఖరీదుగా హుజూరాబాద్ ఎన్నిక.. ఓట్ల కోసం ఏమాత్రం వెనకాడని నేతలు..