కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరేళ్ల క్రితం రెండు పడక గదుల ఇళ్ల పనులు ప్రారంభించారు. నిర్మాణాలు పూర్తై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు దెబ్బతినే స్థాయికి చేరుకున్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలం కోర్కల్‌లో రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించారు.
పోతిరెడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లిలో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కానీ పూర్తయిన చోట సైతం లబ్ధిదారులకు అందజేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడు, అప్పుడు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. మరోవైపు ఇండ్లను కేటాయించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. ఇటీవల ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. అయినా సమస్య పరిష్కరించడం లేదని వాపోతున్నారు.
హుజూరాబాద్ గణేష్‌నగర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల కిటీకీలు విరిగిపోయాయి. విద్యుత్తు బోర్డులను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఇళ్లల్లో కుక్కులు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. గుడిసెల్లో ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ కాలం వెల్లదీస్తుంటే... తమపై ఎవరికి కనికరం కలగడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిర్మాణం పూర్తయిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకోకముందే కేటాయించేలా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.
"రెండు పడకల గదుల ఇండ్లు కట్టి ఆరు సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు." -స్థానికులు
ఇవీ చదవండి: 'అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..' నిర్మలాసీతారామన్‌కు హరీశ్ సవాల్..