మద్యం, ధన ప్రలోభాలతో హుజూరాబాద్‌లో తెరాస గెలవాలని చూసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay ) ఆరోపించారు. తెరాస అబద్ధాలను హుజూరాబాద్ ప్రజలు నమ్మలేదన్నారు. తెరాస జిమ్మికులను నమ్మకుండా ఈటలను విశ్వసించారని... హుజూరాబాద్ ప్రజలకు భాజపా రుణపడి ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి ఈటల అని... ఉద్యమకారుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ఎన్నికలు ఉండటంతో హుజూరాబాద్‌లో అన్ని అప్పటికప్పుడే అమలు చేశారని గుర్తు చేశారు. తెరాస జిమ్మికులను నమ్మకుండా ఈటలను విశ్వసించారని వెల్లడించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేపట్నుంచి హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని బండి సంజయ్ (Bandi Sanjay ) డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలన్నారు. తెరాస ప్లీనరీ సమావేశంలో దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ వినిపించారు. ఉప ఎన్నికతో ఎన్నికల కమిషన్ పని అయిపోయిందని... సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా రేపటి నుంచే హుజూరాబాద్‌లో దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. లేకుంటే తమ కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
'హుజూరాబాద్‌లో తెరాస నేతలు అబద్ధాలతో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికకు సంబంధంలేని విషయాలపై ప్రచారం చేశారు. అబద్ధాల కోసం ఓ మంత్రినే కేటాయించారు. అబద్ధాల శాఖనే పెట్టారు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఏం చేసినా కూడా ప్రజలు వాస్తవాలు గమించినందుకే ప్రజలు ఈటలకు ఓటు వేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయాలి.'
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి : సీఎల్పీ నేత అయితే ఏంటి.. భట్టిపై రేణుకా చౌదరి ఫైర్