Crops Drying In Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా గంగాధర, నారాయణపూర్ జలాశయాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది. నీళ్లతో కళకళలాడిన నారాణపూర్ ఎత్తిపోతల పథకం ప్రాంతం ప్రస్తుతం బోసిపోయింది. కాల్వలో నీరు రాకపోవడంతో ఆ ప్రాంతం బీడుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. జలాశయానికి నీరు వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్న రైతులు గతేడాది నుంచి దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా వదిలేసిన వారు, మిగిలిన పంటనైనా కాపాడుకోవాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ఆరేళ్లుగా రెండు పంటలకు ఎల్లంపల్లి నీటిని గంగాధర, నారాయణపూర్ చెరువుల ద్వారా వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు ఎత్తిపోస్తున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తుండగా ఈ యాసంగిలో విడుదలపై సందిగ్ధంతో సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా వదిలేశారు. బోయినపల్లి, వేములవాడ వైపు కుడికాలువ పూర్తికాకపోగా ఎగువ గ్రామాల్లో కేవలం ఆరుతడి పంటలు వేస్తుండగా ఇప్పుడు చెరువులకు గండ్లు పడి ఎడమ కాలువకు కూడా నీరు అందించలేని దుస్థితి నెలకొంది.
Farmers Worry As Crops Drying: గంగాధర, కొడిమ్యాల, మల్యాల, రామడుగు, చొప్పదండి మండలాల్లో ఈ ప్రాజెక్టు ఆధారంగా దాదాపు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ నెలాఖరుతో ఎండలు ముదరనుండగా బావులు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్ చెరువును ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా నింపి పంటలు కాపాడితే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని వాపోతున్నారు.
వర్షాకాలంలో భారీ వరదలకు గంగాధర, నారాయణపూర్ చెరువుల కట్టలు తెగిపోగా నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. రైతుల ఆందోళనతో ప్రభుత్వం రూ. 90 లక్షల నిధులు మంజూరు చేయగా.. నారాయణపూర్ చెరువు కట్ట మరమ్మతులు పూర్తి చేశారు. అయితే తమకు రావాల్సిన పరిహారం చెల్లించాకే గంగాధర ఎల్లమ్మ చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని మంగపేట గ్రామస్థులు పలుసార్లు అధికారులను అడ్డుకున్నారు. చెరువుల్లో నీరు నింపితే తమ పంట భూములన్నీ మునిగిపోతాయని మరోవైపు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు రైతులు చెరువులు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలంటూ ఆందోళన కొనసాగుతోంది. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
"ఈ రిజర్వాయర్‌కు యాసంగికి నీరు అందిస్తాము అని చెప్పితే.. ఆశపడి పంటలు వేశాము. ఎకరానికి దాదాపు రూ.25వేలు నుంచి రూ.30వేలు వరకు ఖర్చు అయ్యింది. ఇప్పుడు సగం వేసిన పంట కూడా రోజూ కొన్ని గుంటలు చొప్పున ఎండిపోతుంది. ప్రతి సంవత్సరం మాకు ఇదే సమస్య వస్తుంది. ఏ ఏడాది సమయానికి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు." - రైతు
ఇవీ చదవండి: