Crop Damage in Telangana : అకాల వర్షాలు ధాటికి అన్నదాతలు కుదేలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో చెడగొట్టు వానలు, వడగండ్లు విరుచుకుపడుతున్నాయి. కొలుగోలు కేంద్రాల్లో కర్షకుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. అకాల వర్షం వల్ల హనుమకొండ జిల్లా పరకాలలో కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న తడిసిపోయాయి. జోరు వానతో ధాన్యం కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. 20 రోజుల నుంచి వడ్లు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నా.. తమని ఎవరూ పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. టార్పాలీన్లు సరిపడా లేకపోవడంతో నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. బుగ్గారం, మద్దునూరు, సిరికొండ, చలగల్, కమలాపూర్‌లో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం నీటి పాలైంది. సిద్దిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో కూడా వడ్లు జలార్పణం అయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న నిల్వలు పూర్తిగా తడిచిపోయాయి. మక్కల్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు వేల బస్తాల వరకు తడిసినట్లు కర్షకులు వాపోయారు.
Crop Damage: 'అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది'
Heavy Rains In Telangana : మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. వడ్లు తూకం వేసి 20 రోజులు గడిచాయని లారీలు రాక కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం గొల్లపల్లి, మైలారంలోనూ లారీల కొరతతో ధాన్యం మిల్లులకు తరలించలేదు. వడ్లు తరలింపులో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలని ప్రభుత్వంపై మండిపడ్డారు.
రైతులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ ఆందోళన చేపట్టాయి. వెంటనే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీజేపీ కార్యకర్తలు మహాధర్నా చేపట్టారు. బస్తాకు మూడు కిలోల చొప్పున కోతలు విధిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అందరూ కలిసి రైతుల్ని పీక్కు తింటున్నారని బీజేపీ మండిపడింది. అకాల వర్షాలతో తడిసిన వడ్లను ప్రభుత్వమే ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం-ములుగు ప్రధాన రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్‌ప్లాజా వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
'అకాల వర్షాలకు పొలం మీదనే సగం పంట రాలిపోయింది. ఎకరానికి 40 బస్తాలు అయ్యే పంట ఇప్పుడు 15 బస్తాలు అయింది. అది అమ్ముదామని కొనుగోలు కేంద్రాలకు తీసుకోస్తే.. ఇక్కడ లారీల కోరతతో నిలిపివేశారు. మళ్లీ అకాల వర్షాలు వచ్చాయి.. ఆ తెచ్చిన 15 బస్తాలు కూడా తడిసిపోయి.. చాలావరకు కొట్టుకుపోయాయి. రైతులను ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలి. మాకు ఏదో ఒక న్యాయం ప్రభుత్వమే చేస్తుందని భావిస్తున్నాం'. -రైతు
ఇవీ చదవండి: