రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ... దేశంలో అగ్రగామిగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. రైతుల అభివృద్ధి కోసమే రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువచ్చామని అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామంలో పత్తిని సేకరించే యంత్రాల క్షేత్ర ప్రదర్శన, వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్, కలెక్టర్ శశాంకతో కలిసి ఆయన పాల్గొన్నారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ద్వారా ఆగ్రోస్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో మొదటిదశలో ప్రయోగాత్మకంగా పది మంది రైతులకు ఈ యంత్రాలను పంపిణీ చేశారు.
మార్పుల దిశగా సన్నాహాలు
భూసారాన్ని బట్టి ఏ భూముల్లో ఏ పంటలు వేస్తే బాగుంటుందో పరిశోధనలు జరుగుతున్నాయని... ప్రపంచ దేశాల మార్కెట్‌కు తగినట్టుగా మన రాష్ట్రం నుంచి నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. రైతులు సాదాబైనామాల ద్వారా కొన్న వ్యవసాయ భూములను నిర్దేశిత గడువులోగా రిజిస్ట్రేషనులు చేసుకోవాలని కోరారు. ఇస్రో సహకారంతో రానున్న రోజుల్లో శాటిలైట్ ద్వారా భూమి సర్వే నంబర్‌ను 3డీ రూపంలో పొందుపర్చబోతున్నామని అన్నారు. సరిహద్దుల విషయంలో కచ్చితమైన లెక్కలు ఉండి, భూ వివాదాలు జరిగే ఆస్కారం ఉండదని పేర్కొన్నారు.
విస్తరించే యోచన
రాష్ట్రంలో మొదటిసారిగా గొడిశాల గ్రామంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని, గొడిశాల గ్రామాన్ని ఎంచుకున్న నేషనల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ, ఆగ్రో సంస్థ యజమాన్యాన్ని వినోద్ కుమార్ అభినందించారు. పత్తి సేకరించే ఈ యంత్రాలు అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు తయారు చేసినవని... రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యంత్రాల పనితీరును బట్టి రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించే ఆలోచన చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సార్లబుడ్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ పేరాల గోపాల్ రావు, అగ్రోస్ ఎండీ రాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.