ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా కోరుట్ల, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలాల్లో ఒక్కొక్కరి చొప్పున వైరస్‌కు బలయ్యారు. పాజిటివ్‌గా నిర్ధారణయిన కొన్ని గంటల వ్యవధిలోనే వీరు మృతి చెందడం వారి కుటుంబీకులను తీరని వేదనకు గురి చేసింది.
రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఒక్క కరీంనగర్ జిల్లాలో వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు మృతి చెందారు. హుజూరాబాద్, వీణవంక మండలాల్లోని రెండు మరణాలతో జనాల్లో భయం మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే వలస జీవుల తాకిడి ఎక్కువగా ఉన్న జగిత్యాల జిల్లాలో సగటున రోజుకు రెండు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు జగిత్యాల పట్టణంలో ఒకరు, కోరుట్ల మండలంలో ఇద్దరు వైరస్‌తో చనిపోయారు.
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 72 కేసులు
అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నా.. కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 121 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. ఇందులో ఏడుగురు చనిపోగా పలువురు డిశ్చార్జి అయి ఇళ్లకు చేరుకున్నారు. కొన్ని మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 72 కరీంనగర్ జిల్లాలో 26 కేసులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా 18, పెద్దపల్లి జిల్లాలో 5 కేసులు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఆలయాలు, హోటళ్లలో థర్మో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
మాస్కులు, శానిటైజర్లు వాడితేనే
ఇప్పడున్న పరిస్థితిల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. లాక్‌డౌన్ రోజురోజుకి సడలిస్తుండటంతో మార్కెట్లు, బస్సుల్లో తాకిడి అధికంగానే కనిపిస్తోంది. మాస్కులు, శానిటైజర్లు వాడితేనే వైరస్ బారిన పడకుండా ఉంటామని వైద్య శాఖ చెబుతోంది.ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదనే నిబంధన పాటించడమే కాకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్