కరీంనగర్ జిల్లా కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. కొవిడ్-19 మహమ్మారి వల్ల భయాందోళనలతో బతుకుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 24 రోజులుగా చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి పూర్తిగా కోలుకున్నారని, ఆయన్ని డిశ్చార్జి చేశారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. సోమవారం సాయంత్రం కరీంనగర్‌కు తిరిగి వస్తున్న ఆయన్ను హోం క్వారెంటైన్‌లో ఉంచి ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు చేస్తారని వివరించారు.
జిల్లాలో నెల రోజుల నుంచి ఇప్పటివరకు 19 మంది కరోనా బారినపడి చికిత్స పొందగా, మొత్తం 18 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా ఒక్కరే మిగిలారు. సోమవారం కరీంనగర్, హుజురాబాద్‌లలో 42 వైద్య బృందాలు 1232 గృహాలను సందర్శించి 5072 మందికి పరీక్షలు నిర్వహించారు. ఏడు మొబైల్ బృందాలు కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో 783 మందిని పరీక్షించాయి. టెలిమెడిసిన్ ద్వారా 28 మంది, చేయూత కాల్ సెంటర్ ద్వారా ఐదుగురు వైద్య సలహాలు పొందారు.