గ్రానైట్ వ్యాపారం కోసం వచ్చిన చైనా దేశస్థులను వెంటనే స్వదేశానికి పంపించాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖలు కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చైనా వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాలకు సంబంధించిన లిస్టును అందజేయాలని ఆదేశించారు. అక్కడ నివసిస్తున్న వారి పాస్‌పోర్టు నంబర్‌తో సహా పూర్తి వివరాలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. చైనాలో సమస్య ఉన్నంత మాత్రాన వారు ఇక్కడ ఉంటామనడం సరికాదన్నారు కలెక్టర్.
ఎక్కువమంది జనాలు ఒకచోట గుమిగూడే కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఎదుగుదల దశలో ఉందని.. ఈ స్థితిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాధి సోకకుండా, వ్యాపించకుండా అందరం బాధ్యతగా ఉండాలని ఆయన అన్నారు. కరోనా నివారణ చర్యల్లో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నగర మున్సిపల్ కమిషనర్ క్రాంతితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.