కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడకుండా ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, కొనుగోలు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల్లో 21 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
నిబంధనలు సడలించాలి..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ.. నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఈ నిబంధనలు సడలించేలా భాజపా అధ్యక్షుడు గల్లీలో కాకుండా దిల్లీలో నిరసన చేపట్టాలని మంత్రి సలహా ఇచ్చారు.