వాడివేడిగా సాగుతున్న హుజూరాబాద్ ప్రచారం ( Huzurabad By-election campaign).... దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా ఆపేయాలన్న ఈసీ ఆదేశాలతో మరింత వేడెక్కింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad By Poll) కాంగ్రెస్, భాజపా కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ (balka suman) ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్‌తో (etela rajendar) పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్లే కాంగ్రెస్ నుంచి బలహీనమైన అభ్యర్థిని బరిలో దింపారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి భాజపా నాయకులు అనేక అసత్య ప్రచారాలతో విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఓట్ల లెక్కింపు తర్వాత యథావిధిగా..
ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక దళితబంధు పథకాన్ని యథావిధిగా అమలవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) తెలిపారు. హుజూరాబాద్‌లో మాట్లాడిన తలసాని... దళితబంధులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 50శాతం ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉందని... అందువల్లే కేంద్రమంత్రులు ఇక్కడి పథకాలు చూసి ప్రశంసిస్తుంటారని అన్నారు.
యాదాద్రీశుడి మీద ప్రమాణానికి సిద్ధమా..?
జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో రోడో షో నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay).... తెరాసపై విమర్శలు చేశారు. దళితబంధు నిలిపివేతపై తెరాస అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. తెరాసకు చెందిన వాళ్లే లేఖ రాసి, పథకాలు ఆపి, భాజపాపై నెపం వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. నాగార్జుసాగర్ ఎన్నిక తర్వాత గొర్రెల పంపిణీ పథకం ఆగిపోయిందని పేర్కొన్నారు. దళితబంధు ఆపాలని తాను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా అని ప్రశ్నించిన బండి.... యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
నన్ను ఓడించేందుకు ఆ పథకం తెచ్చారు
దళితులపై ప్రేమతో దళితబంధు పథకాన్ని తీసుకురాలేదని... తనను ఓడించాలన్న ఉద్దేశంతోనే తీసుకువచ్చారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించలేదని.... తెచ్చిన తెరాసను ప్రజలు గెలిపించారని తెలిపారు.
ఇదీ చూడండి: ETELA ON KCR: నన్ను అసెంబ్లీకి రాకుండా చేసేందుకే దళితబంధు: ఈటల